షాజహాన్‌పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి.
టైలర్‌గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు.
బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు.


