ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం | AC Blast At Delhi Ex IAS Officer Dhanendra Kumar dies | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం

May 29 2026 11:46 AM | Updated on May 29 2026 2:52 PM

AC Blast At Delhi  Ex IAS Officer  Dhanendra Kumar dies

సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో  ఏసీ  ఇండోర్‌  యూనిట్‌ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ   ఘటనలో మంటలు చెలరేగి  మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మృతిచెందారు.

పోలీసులకు సమాచారం  ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్‌లోని ఆర్‌-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్‌కు ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కానీ  దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్‌, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని  వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

 

షార్ట్ సర్క్యూట్ : ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గృహ సహాయకుడు రమేష్  మీడియాకు వెల్లడించారు. 

ఎవరీ ధనేంద్ర కుమార్ ? 
ధనేంద్ర కుమార్ 1946లో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఐఏఎస్ (IAS) అధికారి. తన సుదీర్ఘ కెరీర్‌లో కేంద్ర, హర్యానా ప్రభుత్వాలలో పలు కీలక పదవుల్లో సేవలందించారు.

ఈయన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలి ఛైర్మన్ కూడా. 2009 ఫిబ్రవరి- 2011 జూన్ వరకు పనిచేశారు. మార్కెట్లో పెద్ద కంపెనీల ఏకఛత్రాధిపత్యాన్ని అరికట్టే చట్టాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర రక్షణ శాఖ, రోడ్డు రవాణా & రహదారుల శాఖ, సాంస్కృతిక శాఖల్లో కార్యదర్శిగా (Secretary) పలు సేవలందించారు.

2005, నవంబర్ -2009, జనవరి  వరకు వరల్డ్ బ్యాంక్‌లో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ దేశాల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా హర్యానా ముఖ్యమంత్రికి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. అక్కడ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 'నేషనల్ సిటిజన్స్ అవార్డు' లభించింది. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన చురుగ్గా ఉన్నారు. COMPAD సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో చీఫ్ మెంటార్‌గా సేవలందించారు.

Advertisement
 
Advertisement
Advertisement