
న్యూఢిల్లీ: ఓ వృద్ధుడి పిత్తాశయంలో ఒకటీరెండూ కాదు ఏకంగా 8,125 రాళ్లు బయటపడిన అరుదైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడొకరు కొన్నేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆకలి మందగించడం, తరచూ జ్వరం బారినపడటం, ఛాతీ, వెన్నెముక భాగంలో బరువుగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దీంతో, ఈ నెల 12వ తేదీన గురుగ్రామ్‌లోని ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకువచ్చారు.
అల్ట్రా సౌండ్ పరీక్ష చేయగా పిత్తాశయ భాగమంతా రాళ్లతో నిండిపోయి కనిపించింది. దీంతో, వెంటనే లాపరోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గంటసేపట్లో శస్త్ర చికిత్స పూర్తయింది. అందులో వచ్చిన 8,125 రాళ్లను లెక్కించేందుకు వైద్య సిబ్బందికి ఏకంగా ఆరు గంటలు పట్టిందని ఆస్పత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కొలెస్టరాల్ అసమతౌల్యం కారణంగా గాల్‌స్టోన్స్ ఏర్పడుతుంటాయి. వీటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే ఇవి పెరిగిపోయే ప్రమాదముంది. ఈ కేసులో రోగి శస్త్రచికిత్సకు నిరాకరిస్తూ చాలాకాలంపాటు తాత్సారం చేశారని ఆస్పత్రి తెలిపింది.
పరిస్థితి మరీ విషమించాకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆపరేషన్‌కు అంగీకరించారని పేర్కొంది. ఆపరేషన్ తర్వాత రెండు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జి చేశామని వెల్లడించింది. ఇప్పటికీ సర్జరీ చేయకుంటే అక్కడ చీము పేరుకుపోయి గట్టిపడి, పిత్తాశయం గోడలు మందంగా తయారవుతాయని, ఆ భాగంలో క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం సైతం ఉంటుందని గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ ఆంకాలజీ వైద్యుడు అమిత్ జావెద్ చెప్పారు. దేశ రాజధాని ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో పిత్తాశయంలో రాళ్లు బయటపడటం ఇదే మొదటిసారి కావచ్చని ఫోర్టీస్ ఆస్పత్రి తెలిపింది. అసాధారణమైంది కానప్పటికీ ఇది అరుదైన కేసని పేర్కొంది.