పంజాబ్‌లో దారుణం జరిగింది. బైసాఖీ పండుగ ముగించుకొని వస్తున్న భక్తుల బస్సు ఫతేఘర్ సాహెబ్ జిల్లా వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 21 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
బైసాఖీ పండుగ సందర్బంగా పంజాబ్‌లోని ఓ భక్తుల బృందం రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పుర్ సాహెచ్ వద్దకు వెళ్లారు. అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు హిమంతపుర్ గ్రామం వద్ద బస్సు బోల్తా పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్లు పేర్కొన్నారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. అయితే ప్రమాదంలో మృతిచెందిన వారంతా మెయిన్ మెజ్రా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా బైసాఖీ (వైశాఖి) పండుగను నిన్న ఏప్రిల్ 14, మంగళవారం నాడు జరుపుకున్నారు. ఇది పంజాబీలకు అత్యంత ప్రాధాన్యమైన పండుగ. ఇది ప్రధానంగా కొత్త సంవత్సరం, కోత పండుగ రైతులు తమ పంటలు చేతికి వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు.


