రూ. 300 కోట్ల స్కామ్‌.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు | 300 crore international cyber fraud syndicate busted in delhi | Sakshi
Sakshi News home page

రూ. 300 కోట్ల స్కామ్‌.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు

Apr 6 2026 2:30 AM | Updated on Apr 6 2026 2:30 AM

 300 crore international cyber fraud syndicate busted in delhi

ఢిల్లీ పోలీసులు భారీ సైబర్‌ క్రైమ్‌ని బట్టబయిలు చేశారు. సూమారు రూ. 300 కోట్ల విలువైన భారీ అంతర్జాతీయ ప్రాడ్‌ని గుర్తించి ఈ కేసుకు సంబంధించిన  11 మంది నేరస్థులను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే ఢిల్లీకి  చెందిన సుల్తాన్ అనే వ్యక్తి, పెట్టుబడి పథకం పేరుతో తనను రూ. 31.45 లక్షలు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని నమ్మించి, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని పెట్టుబడులు పెట్టిన తర్వాత క్యాష్ విత్‌డ్రా కోసం  ప్రయత్నిస్తే ఆ యాప్ పనిచేయడం ఆగిపోయిందన్నారు.

అయితే ఈకేసు విషయమై విచారణ చేపట్టగా ఈ ముఠాకు  కంబోడియా వంటి దేశాల్లోని అంతర్జాతీయ సైబర్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితులు 100కు పైగా నకిలీ కంపెనీల పేరుతో 260కి పైగా బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై ఇప్పటివరకు 2,567 ఫిర్యాదులు నమోదయినట్లు పేర్కొన్నారు..

అయితే  ఈ ముఠాకు సంబంధించిన కీలక వ్యక్తి కరణ్ కజారియా. ఇతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా, ఏప్రిల్ 3న కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇతను విదేశీ ఆపరేటర్లకు, భారతీయ ఏజెంట్లకు మధ్య వారధిగా ఉంటూ, దోచుకున్న సొమ్మును క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశాలకు తరలించేవాడని తెలిపారు.

అరెస్టు సమయంలో నిందితుల వద్దనుంచి 48 మొబైల్ ఫోన్లు,అనేక ఏటీఎం కార్డులు, చెక్కు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రూ. 19 లక్షల నగదును బ్యాంక్ ఖాతాల్లో స్తంభింపజేసినట్లు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement