Kota: మరో ఇద్దరు.. ఈ ఏడాదిలోనే 24 మంది! | Sakshi
Sakshi News home page

కోటాలో మరో ఇద్దరి బలవన్మరణం.. ఈ ఏడాదిలో 24 మంది!

Published Mon, Aug 28 2023 10:50 AM

2 Students Die By Suicide Hours In Kota Total 24 This Year - Sakshi

రాజస్థాన్‌లో కోచింగ్‌ సెంటర్‌ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు ఎంతటి చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్‌ పరిక్షకు ప్రిపేర్‌ అవుతున్న 18 ఏళ్ల అవిష్కర్ శంబాజీ కస్లే, ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు.

పరీక్ష రాసిన వెంటనే..
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాకు చెందిన అవిశంకర్‌ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. గత మూడేళ్లుగా తల్వాన్డీ ప్రాంతంలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి అద్దె గదిలో ఉంటూ నీట్‌ యూజీకి సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోచింగ్‌ సెంటర్‌లో పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొన్ని గంటల్లోనే మరో విద్యార్థి..
వెంటనే ఇనిస్టిట్యూట్‌​ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బిహార్‌కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ తన అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ఇతను కూడా పరీక్ష రాయగా.. అనంతరం రూమ్‌కు వచ్చి సాయంత్రం 7 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు.

పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్‌ తన బంధువులతో కలిసి ఉంటుండగా.. అతను కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇద్దరి వద్ద కూడా ఎలాంటి సుసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..

రెండు నెలలు బంద్‌
వరుస విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్‌ ఓపీ బంకర్‌ కోచింగ్‌ సెంటర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా గదుల్లోని ఫ్యాన్‌లకు యాంటీ సుసైడ్‌ డివైజ్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఒకరోజు ఎలాంటి పరీక్షలు, తరగతులు నిర్వహించకుండా హాలీడే ఇవ్వాలని ఆదేశించారు.

24కు చేరిన సంఖ్య
పోటీ ప్రవేశ పరీ క్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్తాన్‌లోని కోటా పట్ట ణం ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 24కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది మరణించారు. ప్రస్తుతం కోటాలో దేశం నలుమూలల నుంచి వచ్చి దాదాపు మూడు లక్షల మంది వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి.

హాస్టల్‌ భనాలకు వలలు
విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్‌లను స్ప్రింగ్‌లకు బిగించారు. తాజాగా అన్ని హాస్టల్‌ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. 
చదవండి: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది దుర్మరణం

Advertisement
Advertisement