9 నెలల విస్తృత దర్యాప్తు తర్వతా ఇద్దరి అరెస్ట్‌

2 Arrested For Theft Aboard Aircraft Carrier Cochin Shipyard - Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మిస్తున్న స్వదేశీ విమాన వాహక నౌక నుంచి క్లిష్టమైన ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌ను దొంగిలించినందుకుగాను బిహార్, రాజస్తాన్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు స్వీకరించిన ఉగ్రవాద నిరోధక సంస్థ అనేక రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు విస్తృతమైన దర్యాప్తు జరిపిన తరువాత నిందితులు సుమిత్ కుమార్ సింగ్ (23), దయా రామ్‌(22)లను బుధవారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల వద్ద నుంచి ‘దేశ భద్రతకు సంబంధించిన’ డాటాతో పాటు ప్రాసెసర్లు, ర్యామ్‌లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లతో సహా దొంగిలించిన ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సుమిత్‌ కుమార్‌ సింగ్‌ బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన వాడు కాగా.. దయా రామ్‌ రాజస్తాన్‌కు చెందిన హనుమన్‌గఢ్‌కు చెందినవారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దొంగిలించబడిన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తిరుచ్చిలో ఎన్‌ఐఏ దూకుడు)

                                 (నిందితులు దయారమ్‌, సుమిత్‌ కుమార్‌ సింగ్‌(ఎడమ నుంచి))

ఈ సందర్భంగా ఎన్‌ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరిద్దరు నిర్మాణంలో ఉన్న విమాన వాహక నౌకలో పెయింటింగ్ పనిలో కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. డబ్బుకు ఆశపడి ఎలక్ట్రానిక్‌ పరికరాలను దొంగిలించారు. వాటిలో ఐదు మైక్రో ప్రాసెసర్లు, 10 ర్యామ్‌లు, ఓడలోని మల్టీ-ఫంక్షనల్ కన్సోల్‌ల నుంచి ఐదు సాలిడ్‌ స్టేట్ డ్రైవ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబరులో నిందితులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. విషయం తెలియడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్‌ఐఏ సెప్టెంబర్ 26 న కేసును రీ రిజస్టర్‌ చేసి అక్టోబర్ 16 న కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు బదిలీ చేయించుకున్నాము. నిందితుల కోసం ఈ తొమ్మది నెలల కాలంలో ఓడలో పనిచేసిన 5,000 మందికి పైగా వేలు, అరచేతి ముద్రలను ఏజెన్సీ విశ్లేషించింది. పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాము. అంతేకాక ఈ "బ్లైండ్ కేసు" నిందితులను పట్టుకోవడం కోసం 5 లక్షల రివార్డును ప్రకటించాము’ అని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top