రెండు దశాబ్దాల తరువాత.. | ​Abdul Rahim returns home to Kerala after 20 years in Saudi prison | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల తరువాత..

May 28 2026 11:05 AM | Updated on May 29 2026 1:17 PM

​Abdul Rahim returns home to Kerala after 20 years in Saudi prison

బక్రీద్‌ వేళ కేరళ ముస్లిం కుటుంబానికి నిజమైన మండుగ

కేరళలోని కోజికోడ్‌ సమీపంలో ఉన్న ఫెరోక్‌లోని ఆ ఇంట్లో బక్రీద్‌ నాడు అసలైన వేడుక జరిగింది. సౌదీ జైలులో రెండు దశాబ్దాలు గడిపి, మరణశిక్షను ఎదుర్కొన్న వ్యక్తి కేరళకు తిరిగి వచ్చాడు. టీనేజర్‌ మృతికి కారణమయ్యారనే అభియోగంతో మరణశిక్ష పడిన వ్యక్తి.. ఉరిశిక్ష నుంచి తృటిలో తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాడు.  

డ్రైవర్‌గా వెళ్లి కేర్‌ టేకర్‌గా..
సౌదీ అరేబియాకు వెళ్లడానికి ముందు రహీం కేరళలో ఆటోరిక్షా, స్కూల్‌ బస్సు నడిపాడు. ఆరుగురు తోబుట్టువులలో అందరికంటే చిన్న వాడైన అతను, డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించి తర్వాత 2006 నవంబర్‌ 28న రియాద్‌కు వెళ్లాడు. కానీ, పక్షవాతంతో బాధపడుతూ శ్వాస పరికరంపై ఆధారపడి జీవిస్తున్న 17 ఏళ్ల వ్యక్తికి కేర్‌టేకర్‌గా పని ఇచ్చారు. 2006 డిసెంబర్‌ 24న, ఆ బాలుడిని వెనుక కూర్చో బెట్టుకుని రహీమ్‌ వాహనం నడుపుతుండగా శ్వాస సహాయక పరికరం ఊడిపోవడంతో ఆ బాలుడు మరణించాడు. అప్పుడు 26 ఏళ్ల వయసున్న రహీం, సౌదీ అరేబియాకు వచ్చిన కేవలం 28 రోజులకే అరెస్టయ్యాడు. 2011లో సౌదీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ శిక్షను సమర్థించాయి.

పరిహారంతో పరిష్కారం...
అతనికి మరణశిక్ష ఎప్పుడైనా పడొచ్చని అతని కుటుంబం అనుక్షణం భయంతో జీవించింది. అయితే రూ. 34 కోట్ల పరిహారం ఇస్తే రహీంను క్షమించడానికి ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో అతని మరణ శిక్షను రద్దు చేశారు. పొట్టకూటి కోసం అంతదూరం వెళ్లిన రహీం అంతమొత్తాన్ని ఎలా ఇవ్వగలడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజం అతనికి సాయం చేసింది. భారీ క్రౌడ్‌ఫండింగ్‌తో విరాళాలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల్లోనే విరాళాలు సేకరించి పరిహారం పూర్తిగా చెల్లించారు. అయితే, రహీం 20 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేయాలని సౌదీ అధికారులు ఆదేశించారు. అరబిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది మే 20న ఆ శిక్ష ముగిసింది.

తండ్రిని కోల్పోయి.. 
కోజికోడ్‌లో రహీం కుటుంబానికి ఈ సమయం పరీక్షలా నిలిచింది. అతను జైలు పాలైన ఆరు నెలలకే తండ్రి ముహమ్మద్‌కుట్టి మరణించారు. క్షమాభిక్ష మంజూరైన తర్వాత 2024 నవంబర్‌లో తల్లి ఫాతిమా అతన్ని ఒక్కసారి మాత్రమే కలవగలిగింది. వీడియో కాల్స్‌ వారికి ఊరటనిచ్చాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణకు గురువారం తెరపడింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వారందరికీ రహీం కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి చేరుకున్న రహీం ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టి, తన విడుదలను సుసాధ్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులందరికీ రహీం ధన్యవాదాలు తెలిపాడు. బక్రీద్‌ పండుగ సమయంలోనే రహీం తిరిగి రావడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతని స్నేహితులు, స్థానికులు తెలిపారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement