మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచాలని ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీధర్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, సీఈ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్టేజీ–1 పంప్‌హౌజ్ వద్ద మూడోపంపు ఏర్పాటును వారు పరిశీలించారు. ఫేజ్–1 పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూ సేకరణ వేగవంతం చేయాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాట్రేవ్‌పల్లి, బాపూర్, పేరపళ్ల ఎత్తిపోతల పంప్‌హౌజ్‌ల వద్ద మూడోపంపును స్పేర్‌గా అందుబాటులో ఉంచాలని.. ఏదేని పంపు సాంకేతిక కారణాలతో నిలిస్తే మూడోపంపును వినియోగించవచ్చని సూచించారు. దీంతో ప్రాజెక్టు ద్వారా నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా నీటి సరఫరా జరిగే అవకాశం ఉంటుందన్నారు. రూ.4,725 కోట్లతో ఎత్తిపోతల పనులు చేపడుతున్నట్లు వివరించారు. భూ పరిహారం అందరికి అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వారి వెంట ఎస్‌ఈ శ్రీధర్, నాగశివ, ఈఈ గోపాలచారి, నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు.


