సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది.
జోగుళాంబ గద్వాలలో అత్యధికం..
ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ము ప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయ ట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వే యకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ వంటివి తీసుకో వాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ
వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు
కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు
బయటకు వెళ్తే జాగ్రత్తలు
తప్పనిసరి అంటున్న వైద్యులు


