● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూతబడనున్న 2,100 దుకాణాలు
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఔషధ నియంత్రణ శాఖ
పాలమూరు: ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా డ్రగ్గిస్ట్, కెమిస్ట్ పిలుపుమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం 2,100 మెడికల్ దుకాణాలు మూతపడనున్నాయి. మెడిసిన్ విక్రయాల్లో కొన్ని కార్పొరేట్ సంస్థలు వినియోగదారులకు ఇస్తున్న భారీ రాయితీలు నిలిపివేయాలని, ఈ–ఫార్మసీ చట్టం రూపుదాల్చకపోవడంతో కరోనా సమయంలో డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సమ్మె నిర్వహణపై కలెక్టర్ ఖుష్బూ గుప్తాతోపాటు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్‌లకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాంమోహన్, కోశాధికారి రాఘవేందర్, కన్వీనర్ నాగభూషణం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
ఉమ్మడి జిల్లాలో బుధవారం మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్ ఒక ప్రటకనలో తెలిపారు. ప్రజలకు అత్యవసర మెడిసిన్ కోసం నగరంలో క్లాక్‌టవర్, న్యూటౌన్, ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మెడికల్ దుకాణాలు తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే ప్రతి ఫార్మసీలోనూ మెడిసిన్ యథావిధిగా అందుబాటులో ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఉండే రెడ్‌క్రాస్ జీవనధార సైతం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి పట్టణంలో మెడ్‌ప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ దుకాణాలతోపాటు మరో మూడు దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎక్కడైనా మెడిసిన్ అందుబాటులో లేకపోతే మహబూబ్‌నగర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సెల్ నం.83338 18147, జడ్చర్ల సెల్ నం.83339 25839లను సంప్రదించాలని సూచించారు.


