నారాయణపేట: జిల్లాకేంద్రంలో ఈ నెల 22న నిర్వహించే జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లాస్థాయి అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు, ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితా, ఆయా పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని.. శాఖల వారీగా అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. స్క్రీన్, సౌండ్ సిస్టంను తహసీల్దార్‌తో సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయాలని డీపీఆర్వో రషీద్‌ను ఆదేశించారు. అలాగే స్నాక్స్, భోజన ఏర్పాట్లను చూసుకోవాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు.
జూన్ 2 వేడుకలకు ఏర్పాట్లు..
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. వీసీ హాల్‌లో సంబంధిత అధికారులతో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా అట్టహాసంగా నిర్వహించాలని.. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని, గార్డ్ ఆఫ్ హానర్ పోలీసుశాఖ, స్టేజ్, మైక్, సౌండ్ సిస్టం, జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని సీపీఓను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ వెంకట్రాములు, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, ఆర్డీఓ రమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


