పనుల్లో అవినీతికి అడ్డుకట్ట
● సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
● ప్రతి గ్రామంలో ఆరుగురు సభ్యులతో..
–8లో u
మరికల్: ఉపాధిహామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్ మానిటరింగ్) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధిహామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లోని 272 గ్రామాల్లో 1,07,593 జాబ్‌కార్డులు ఉండగా.. 97,708 మంది కూలీలు నమోదయ్యారు. ఏటా చేపట్టే ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యను గుర్తించిన కేంద్రం పనుల్లో మార్గదర్శకాలు పాటించడం లేదంటూ పని దినాల్లో కోత విధించడం మొదలు పెట్టింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో ఆరుగురు సభ్యులతో నిఘా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పర్యవేక్షణ ఇలా..
కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు తగిన ప్రాతినిథ్యం ఉండగా సభ్యుల్లో సగం మంది మహిళలు ఉంటారు. ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు, సోషల్ ఆడిట్ వనరుల వ్యక్తులు, యువజన సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థల నుంచి సభ్యులను ఎంపిక చేయాలి. గ్రామసభ ద్వారా కనీసం 6 నెలల కాలానికి కమిటీని ఎన్నుకోవాలి. ఉపాధి పనులు జరిగిన వారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తాయి. పనుల మంజూరు, నాణ్యతను అంచనా వేయడం, కూలీల హాజరు, వేతన చెల్లింపులు పారదర్శకంగా జరిగాయా లేదా తదితర వివరాలను నమోదు చేస్తారు. సామాజిక తనిఖీ సమయంలో గ్రామసభకు సమర్పించాలి. ఈ నివేదికలు ప్రజాపత్రాలుగా పరిగణించాలని, అవసరమైతే గ్రామపంచాయతీలో అందుబాటులో ఉంచాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.


