దొంగ దొరికేశాడు.. | - | Sakshi
Sakshi News home page

దొంగ దొరికేశాడు..

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

నారాయణపేట: మక్తల్‌లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఓ దొంగ అదే ఊరిలో అందరితో కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవాడని తెలిసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. కర్రెం సూర్యనారాయణ అలియాస్‌ తిమ్మప్ప అలియాస్‌ తిప్పి, సూర్య సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ ఉదయం వేళ పట్టణంలో తిరుగుతూ రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతుండేవాడు. ఒకే తరహా లో వరుస చోరీలు జరగడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినా నిందితు డిని గుర్తించలేకపోయాయి. పట్టణంలోని రెండు, మరికల్‌లో ఒక బంగారు దుకాణం, మక్తల్‌లో మూడు మద్యం దుకాణాలు, ఓ ఇల్లు, ద్విచక్ర వాహనాల షోరూం, మొబైల్‌, కిరాణ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ జరిగిన ప్రతిచోటా ఒకే తరహా ఆనవాళ్లు కనిపించడంతో ఇది ఒకే ముఠా పనని పోలీసులు అనుమానించారు.

వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..

మక్తల్‌ ఎస్‌ఐ వై.భాగ్యలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు నారాయణపేట క్రాస్‌రోడ్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి బైక్‌ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్‌ఐ, సిబ్బంది వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి పేరు కర్రెం సూర్యనారాయణ అలియాస్‌ తిమ్మప్ప అలియాస్‌ తిప్పి, సూర్య అని.. అంబేడ్కర్‌నగర్‌ కాలనీ, మక్తల్‌లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా మంకీ క్యాప్‌, దొంగతనాలకు వినియోగించే సామగ్రి, చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు లభించాయి. మక్తల్‌, మరికల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడి..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడిన నిందితుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సరదాగా ప్రారంభమైన ఆనన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనంగా మారి డబ్బులు నష్టపోయి చివరకు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకొని బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను తిరిగి బెట్టింగ్‌లకే వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఏడాది కాలంగా పగటి వేళలో రెక్కీ నిర్వహించి మక్తల్‌ ప్రాంతంలోని దుకాణాలు, తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు మంకీ క్యాప్‌, గ్లౌజులు ధరించి ఎలక్ట్రిక్‌ కట్టర్‌, భారీ సుత్తి, కటింగ్‌ ప్లేయర్స్‌, స్క్రూడ్రైవర్లు తదితర సామగ్రితో షట్టర్ల తాళాలు, తలుపులు పగులగొట్టి చోరీ చేసేవాడని పోలీసులు వివరించారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో 9 కేసులు మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కాగా.. ఒక కేసు మరికల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైంది.

మక్తల్‌, మరికల్‌లో10 చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి..

Advertisement
 
Advertisement
Advertisement