విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

నారాయణపేట/కృష్ణా: భవిష్యత్‌లో సంభవించే ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆదేశాల మేరకు జిల్లాలోని కృష్ణా మండలం వాసూనగర్‌లో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. మాక్‌డ్రిల్‌లో ముంపునకు గురై చిక్కుకున్న ప్రజలను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక, పోలీస్‌ శాఖలు సురక్షితంగా రక్షించే చర్యలను ప్రదర్శించారు. బోట్‌, లైఫ్‌ జాకెట్ల సాయంతో ప్రజలను రక్షించి, ప్రథమ చికిత్స అందజేసి అంబులెన్స్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు సంసిద్ధత కోసం మాక్‌డ్రిల్‌ ముఖ్యమైన ప్రక్రియని తెలిపారు. వరదలు వచ్చి అత్యవసర పరిస్థితులు తలెత్తే ఏడు ప్రదేశాలను జిల్లాలో గుర్తించినట్లు వివరించారు. అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటిపారుదల తదితర ముఖ్యమైన శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలను ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌, డీఎఫ్‌ఓ సురేష్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటరమణ, జిల్లా రవాణా అధికారి మేఘాగాంధీ, పీఆర్‌ ఈఈ అశోక్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్‌, పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి, డీపీఆర్వో రషీద్‌, కృష్ణా తహసీల్దార్‌ శ్రీనివాస్‌, వాసూనగర్‌ సర్పంచ్‌ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా నిలువురాళ్లు..

ముడుమల్‌ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక తెలిపారు. సోమవారం కృష్ణా మండలం ముడుమల్‌ నిలువురాళ్లను ఆమె సందర్శించారు. నిలువురాళ్ల ప్రాముఖ్యతను ఆర్కియాలజీ శాఖకు చెందిన అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 వరకు యువజన క్రీడ, పర్యాటక వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. రాష్ట్ర పర్యాటకశాఖకు సంబంధించిన వారోత్సవాల టూరిస్ట్‌ గైడ్‌ పోస్టర్‌తో పాటు మూడుమల్‌ నిలువురాళ్ల విశిష్టతను తెలిపే ప్రచార పత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఆమె వెంట డీపీఆర్వో రషీద్‌, డీవైఎస్‌ఓ వెంకటేశ్‌ శెట్టి, పురావస్తుశాఖ అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement