గద్వాలన్యూటౌన్: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్ సరిత అన్నారు. ఇటీవల టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి వద్ద కాంగ్రేస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మార్గమధ్యలో జమ్మిచేడు వద్ద జములమ్మ అమ్మవారిని సరిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సరిత మాట్లాడారు. గద్వాల ప్రజలు చూపిస్తున్న అభిమానం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి, బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


