నారాయణపేట: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో పనుల పురోగతిపై సమీక్షించారు. వైద్య కళాశాల, ఎంసీహెచ్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల వద్ద ఒక్క బోరు పడకపోవడంతో సమీపంలోని ఒక రైతు పొలానికి చెందిన ప్రైవేట్ బోర్ నుంచి నీటిని క్యూరింగ్‌కు వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ భవన నిర్మాణాలు ఎక్కడ జరిగినా తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. మండలాల్లోని కస్తూర్బాల్లో మరమ్మతులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో సైనన్స్ ల్యాబ్స్ నిర్మాణాలు పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలన్నారు. మక్తల్‌లోని వంద పడకల ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయని.. అకాడమిక్ బ్లాక్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలుపగా పనుల్లో వేగం పెంచాలని కోరారు. మక్తల్‌లోని జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణం, మద్దూరు ఎస్సీ బాలుర వసతిగృహ మరమ్మతు పనుల గుర్తించి ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏవైనా మరమ్మతులుంటే వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాకేంద్రం సమీపంలో సమీకృత చేనేత భవన నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలుపగా.. జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని మూడు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలు ఆగస్టు వరకు పూర్తి చేయాలని సూచించారు. మక్తల్‌లో సంగంబండ రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ పథకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈలు శ్రీనివాసరావు, రంగారావు తెలిపారు. మన్యంకొండ నుంచి జిల్లాకు రోజుకు ఎన్ని లీటర్ల నీటి సరఫరా జరుగుతుందో నివేదిక ఇవ్వాలని కోరారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో కొనసాగుతున్న రోడ్లు, కలెక్టరేట్ భవన నిర్మాణ పనులపై ఆ శాఖ అధికారులతో చర్చించారు. జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని, గుండుమాల్, కొత్తపల్లి మండలాల సమీకృత భవన సముదాయాల నిర్మాణాలు, కడా నిధులతో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమావేశానికి ఎన్ని పనులు పూర్తి చేశారో? ఎన్ని పర్యటనలు చేశారో నివేదికలతో రావాలని ఏఈలను ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో విధిగా ప్రొటోకాల్ పాటించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో టీజీఎంఐడీసీ ఈఈ వేణుగోపాల్, పీఆర్ ఈఈ అశోక్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటరమణ పాల్గొన్నారు.
విద్యతో ఉజ్వల భవిష్యత్..
నారాయణపేట రూరల్: విద్య భవిష్యత్‌ను తీర్చిదిద్దే మహత్తర శక్తి అని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా విజయోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచే చదువుపై ఏకాగ్రత పెంచుకొని అన్నిరకాల పోటీ పరీక్షల్లో చక్కటి ప్రతిభ కనబర్చాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుట్టిన ఊరికి మంచి పేరు వస్తుందని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గిస్తే మంచిదన్నారు. పది విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని.. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషి అభినందనీయమన్నారు. అనంతరం 560 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ మంజుల, డీఈవో గోవిందరాజు, సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి, విద్యాసాగర్, శశికుమార్ పాల్గొన్నారు.


