‘బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి’

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 11:56 AM

నారాయణపేట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని.. అధికారం న్యాయానికి అడ్డుకాకూడదని వెంటనే భగీరథ్‌ను అరెస్టు చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సాయి భగీరథ్‌ను అరెస్టు చేయడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎందుకు వెనకడగు వేస్తోందని ప్రశ్నించారు. అసలు నిందితుడు దేశంలో ఉన్నాడా లేక దాటించాలనుకుంటారా అనే సందేహాలు నెలకొంటున్నాయన్నారు. 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రధాని హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో 3 రోజుల తర్వాత పోక్సో కేసు నమోదు చేయడంపై పలు అనూమానాలకు తావిస్తోందని తెలిపారు. బండి సంజయ్‌ నైతిక బాధ్యత వహిస్తూ స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోనే హోంశాఖ ఉందని.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా డీఐజీతో విచారణ జరిపించి బాధిత బాలికకు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టిన ఓ మహిళ అధినేత రాష్ట్రంలో ప్రజలందరికి తాను అమ్మాలాంటి దానినని బహిరంగా సభలో చెప్పిందని.. మరి ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే మహిళలతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు విజయ్‌సాగర్‌, సుదర్శన్‌రెడ్డి, బుల్లెట్‌ రాజు, కౌన్సిలర్‌ భరత్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కిక్‌ బాక్సింగ్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

నారాయణపేట ఎడ్యుకేషన్‌: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 9, 10న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి నవీన్‌కుమార్‌ తెలిపారు. 42 పాయింట్‌ ఫైట్‌ క్యాడెట్‌ విభాగంలో నర్వ మండలానికి చెందిన ఆర్య విశ్వకరణ్‌ కాంస్యం, 67 కిక్‌ సీనియర్‌ పురుషుల విభాగంలో నారాయణపేటకు చెందిన కగడ సోనల్‌ రజతం, అదేవిధంగా 67 కిక్‌ సీనియర్‌ విభాగంలో దామరగిద్ద మండలానికి చెందిన సాయిరాం రాథోడ్‌ కాంస్య పతకం సాధించినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement