మదనాపురం: మదనపురం–కొత్తపల్లి మధ్య ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని.. నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని, రాజీ పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో చేపట్టే పనులు వారికి శాశ్వతంగా ఉపయోగపడాలన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల ఇంజనీర్లు ఉన్నారు.


