ఊట్కూర్: సనాతన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిద్దామని స్వామి అనంతానంద భారతి అన్నారు. బుధవారం పట్టణంలోని కళాశాల మైదానంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామీజీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ ధర్మం సనాతనమైందని.. పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడైతే సీ్త్రలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని.. కుటుంబ వ్యవస్థను పటిష్టపర్చాలని కోరారు. పిల్లల్లో చిన్ననాటి నుంచే సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందని తెలిపారు. హిందూ సమ్మేళనానికి వేలాది మంది కుటుంబాలతో హాజరుకావడం ఆనందంగా ఉందని చెప్పారు. మండలంలోని కొల్లూరు, నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి, సమస్తాపూర్, పెద్దపొర్ల తదితర గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీగా హిందూ బంధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరత నాట్యం, కోలాటం, డోలు వాయిద్యాలు, చెక్కభజన తదితర సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు భాగయ్య, సౌభాగ్యలక్ష్మి, సిరిగిరి చందులాల్, కుర్మన్న, గరిడి లింగిరెడ్డి, రేణుక భరత్, శేషప్ప పాల్గొన్నారు.


