నారాయణపేట
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత
● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు
● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్‌కు పెద్దపీట
● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే..
● కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెచ్చింపు
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మ డి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
లక్ష్యం కొండంత.. నిధులు అరకొర
ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్‌లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1,800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది.


