పేట్‌.. సోనేకా థేట్‌! | - | Sakshi
Sakshi News home page

పేట్‌.. సోనేకా థేట్‌!

Mar 9 2026 7:22 AM | Updated on Mar 9 2026 7:22 AM

ఎక్కడా లేని సరాఫ్‌ బజార్‌.. 1896 నుంచి విక్రయాలు.. ఆకట్టుకునేలా డిజైన్లు..

24 క్యారెట్ల బంగారు

ఆభరణాలకు ప్రసిద్ధి

పెళ్లిళ్ల సీజన్‌లో కళకళ..

నారాయణపేట: నారాయణపేట అంటేనే చేనేత చీరలు, బంగారానికి ప్రసిద్ధి. మగువ మనసుదోచే అద్భుతమైన బంగారు ఆభరణాల మన్నికకు మారు పేరుగా.. నగల నాణ్యతలో సోనేకా థేట్‌– నారాయణపేట్‌ అని తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. త్వరలోనే భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌) రానుంది. ఇక్కడి బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌కు 130 ఏళ్ల చరిత్ర ఉంది. స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని ధారాలు తీసి.. నగలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం జనం బంగారం కొనడానికి వస్తుంటారు. ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల టర్నోవర్‌ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఎక్కడైనా మాంసం మార్కెట్‌, కూరగాయల మార్కెట్‌, పత్తి బజార్‌ తదితర బజార్‌లు ఉండటం సహజం. కానీ ఉమ్మడి పాలమూరులోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్‌ బజార్‌ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 150 బంగారం దుకాణాలు వరుసగా ఉండటంతో సరాఫ్‌ బజార్‌గా పేరుపెట్టారు. నగరాల స్థాయిలో ఇక్కడ బులియన్‌ అండ్‌ జువెల్లర్స్‌గా వ్యాపారం సాగుతోంది.

నారాయణపేటలో 1896 నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. నిజాం కాలంలో లహోటికి చెందిన వ్యాపారులు బంగారం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆరంభంలో రాంచందర్‌ మెఘరాజ్‌ భట్టడ్‌, అసారం భట్డడ్‌, వై.సురేశ్‌, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్‌ హన్మంతు, మహ్మద్‌ హసన్‌ సహాబ్‌ చాంద్‌ తదితర 8 బంగారు దుకాణాలు ఉంటే.. ప్రస్తు తం 150కుపైగా దుకాణాలకు విస్తరించాయి.

స్థానికంగా జువెల్లర్స్‌ దుకాణాల్లో తయారు చేసిన ఆభరణాలపై చిన్నసైజులో తమ దుకా ణం పేరు ముద్ర (మోనోగ్రామ్‌) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలుచేసిన వారు విక్రయించేందుకు వెళ్తే గుర్తుపట్టేందుకు వీలుగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. తారాపూర్‌, అమృత్‌సర్‌, ముంబాయి, మచిలీపట్నంలో డైస్‌ తయారవుతాయి. మార్కెట్‌లో డైస్‌ వచ్చిన పదిరోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. అంతేకాకుండా హాల్‌మార్క్‌తో వివిధ రకాల డిజైన్‌ నగలను పశ్చిమబెంగాల్‌ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మి నెక్లెస్‌, లక్ష్మి లాంగ్‌చైన్‌, లాంగ్‌ చైన్‌ తదితర రకాల డిజైన్ల ఆభరణాలు లభిస్తాయి.

వన్నెకు తగ్గని విలువ..

మన్నికకు మారు పేరు

ఇక్కడి బులియన్‌ మర్చంట్‌

అసోసియేషన్‌కు 130 ఏళ్ల చరిత్ర

త్వరలోనే పేట బంగారానికి

జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌

పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు.. సరాఫ్‌ బజార్‌ కళకళలాడుతుంది. శుభకార్యలు, పండుగలు ఉన్నప్పు డు పేట బంగరాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని రాయచూర్‌, యాద్గీర్‌, సేడం, గుల్బర్గ, బీదర్‌, మహారాష్ట్రలో ని పుణె, షోలాపూర్‌, హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావాసులు ఎక్కువగా వస్తుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement