150 పడకల ఆస్పత్రి పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

150 పడకల ఆస్పత్రి పనుల్లో వేగం పెంచండి

Mar 9 2026 7:22 AM | Updated on Mar 9 2026 7:22 AM

మక్తల్‌: నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్‌లో 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి.. పనుల పురోగతిపై ఆరా తీశారు. నవంబర్‌లోగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా హైవే నుంచి ఆస్పత్రికి వచ్చే రోడ్డు విశాలంగా ఉండాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తాయప్ప, రవికుమార్‌, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

గర్భాశయ క్యాన్సర్‌

నివారణే లక్ష్యం

కోస్గి రూరల్‌: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందిస్తుందని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వారు ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌పీవీ టీకాతో గర్భాశయంలో క్యాన్యర్‌ కారక వైరస్‌ నివారించవచ్చని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని సూచించారు. జిల్లాలోని మక్తల్‌, నారాయణపేట, కోస్గి, మద్దూర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,219 టీకాలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి సెంటర్‌కు 400 టీకాలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నాగులపల్లి నరేందర్‌, డీపీఓ భిక్షపతి, వైద్యులు శ్వేత, కిష్టమ్మ పాల్గొన్నారు.

సంఘటిత పోరాటంతోనే హక్కుల సాధన

నారాయణపేట: సంఘటిత పోరాటాలతోనే హక్కులు సాధ్యమవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం అన్నారు. ప్రజాతంత్ర మహిళా సంఘం, మెప్మా ఆర్‌పీల యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ జనాభాలో 48శాతం ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, భద్రత తదితర అంశాలను పరిశీలిస్తే మహిళా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. భారతీయ సంస్కృతికి గొప్ప స్థానం ఉన్నప్పటికీ.. మహిళలపై ఆకృత్యాలు, భిన్న రూపాల్లో దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, సమాన హక్కులు, పని ప్రదేశాల్లో రక్షణ, సెలవులు, ఉచిత న్యాయ సహాయం, పని భద్రత లేకుండా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చి అన్యాయం చేస్తుందన్నారు. శ్రామిక మహిళా లోకం, ప్రజలు కలిసి సంఘటిత ఉద్యమాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సాయి, మాధవి, శాంత పాల్గొన్నారు.

భారీగా వేరుశనగ రాక

నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఆదివారం పెద్దఎత్తున వేరుశనగ అమ్మకానికి వచ్చిందని మార్కెట్‌ అధికారి రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా యార్డుకు 7,906 బస్తాల వేరుశనగ రావడంతో యార్డు మొత్తం పల్లి కుప్పలతో నిండిపోయింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.9,100, కనిష్టంగా రూ.8,400 ధర లభించిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement