
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
మాగనూర్: ఇసుక రీచ్ యాజమానులు వాల్టా చట్టాన్ని అనుసరిస్తూ కూలీల సహాయంతో ఇసుక తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగులో ఇటాచీ, జేసీబీలను వినియోగించవద్దని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలతో పాటు రీచ్ అనుమతులు రద్దు చేయబడతాయని మైనింగ్ ఆర్‌ఐ ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వర్కూర్, మాగనూర్ శివారులో ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న ఆన్‌లైన్ ఇసుక రీచ్‌లను ఆయన తనిఖీ చేశారు. కొందరు ప్రభుత్వ అనుమతులను బేఖాతారు చేస్తూ యంత్రాల సహాయంతో ఇసుక తరలిస్తున్నట్లు సీఎంఓకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈమేరకు రీచ్‌లను పరిశీలించడం జరిగిందన్నారు. అయితే ఇక్కడ కొన్ని రీచ్‌లకు దుబ్బ ఇసుక అనుమతులు ఉండటంతో పాటు ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహంతో రోడ్డు ధ్వంసం అవడంతో యంత్రాలను పనుల నిమిత్తం వినియోగించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాల్టా చట్టాన్ని అనుసరించాలని ఆదేశించారు. ఆయన వెంట టీజీఎండీసీ ఎస్‌ఆర్‌వో శివారెడ్డి, మాగనూర్ ఎస్‌ఆర్‌ఏలు నర్సింహ, మనోజ్ ఉన్నారు.