
ఎట్టకేలకు..!
● నేడు చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్న మంత్రులు
● జిల్లాలో 1.82 కోట్ల చేపలు వదలాలని లక్ష్యం
● వానాకాలం ముగియనుండడంతో సగమే విడుదల చేయనున్న వైనం
● జిల్లాలో 146 మత్స్య పారిశ్రామిక సంఘాలు..11,039 మంది సభ్యులు
నారాయణపేట: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. వర్షాకాలం ముగుస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మత్స్యకారులకు మత్స్యశాఖ తీపి కబురు అందించింది. శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరి తన నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో చేపపిల్లల పంపిణీ చేపట్టాలనుకున్నా ఎన్నికల కోడ్ అమలులోకి రావడం.. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టులో స్టే ఇవ్వడంతో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు అవకాశం కలిగినట్లయింది. జిల్లాలో 13 మండలాల పరిధిలో 146 మత్స్య పారిశ్రామిక సంఘాలు.. 11,039 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీల అధ్వర్యంలో చేపపిల్లలను పెంచి సభ్యులందరూ జీవనోపాధి పొందుతున్నారు.
మూడు రిజర్వాయర్లు.. 642 చెరువులు
జిల్లాలో 3 రిజర్వాయర్లు, 642 చెరువులు, కుంటలు ఉన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 1.82 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం ముందు లక్ష్యం నిర్దేశించగా సమయం మించిపోవడంతో గతేడాది మాదిరిగానే ఈ సారి సగమే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. 35–40 ఎంఎం చేప పిల్లలను సరఫరా చేస్తే లాభం లేదని భావించిన మత్స్యశాఖ 80–100 ఎంఎం చేప పిల్లలను వదిలేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో మంత్రులు వాకిటి శ్రీహరి, దమోదర రాజనర్సింహ పాల్గొననున్నారు. ఈమేరకు ఉదయం 9 గంటలకు సంగబండ రిజర్వాయర్‌లో, 10 గంటలకు మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎట్టకేలకు..!