
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
నారాయణపేట: పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.శీను అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని, తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, తగు వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే పత్తి మార్కెటింగ్ సీజన్ 2025–26లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ మండలాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అంచనా ఉత్పత్తి వివరాలు సేకరించి వాస్తవికంగా సగటు దిగుబడిని లెక్కించనుందని తెలిపారు. రాష్ట్ర సగటు కంటే 10శాతం మించితే ప్రత్యేక ధ్రువీకరణతో మాత్రమే ఆమోదం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డీ ఆర్ డి ఓ మొగులప్ప, డిపీఎం సుధాకర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో జరిగే నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎన్.లింగయ్య అధికారులకు సూచించారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో నారాయణపేట, కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముందుగా డీఎస్పీ పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సిఐ, ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, ఇసుక అక్రమ రవాణా, గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాల జీ ఉపయోగించాలన్నారు. సమావేశంలో సిఐ సైదులు, బాలరాజు, విజయ్ కుమార్, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.
ఉద్యమం ద్వారానే
సమస్యల పరిష్కారం
నారాయణపేట రూరల్: ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి పద్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో గురువారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అతి తక్కువ వేతనాలతో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కేజీబీవీ వర్కర్లను వెట్టి చాకిరీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వాలకు సరికాదన్నారు. దాదాపు 14 గంటల పాటు విధులు నిర్వర్తిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించిన లాభం లేకుండా పోయిందని ఆవేద వ్యక్తం చేశారు. ఈనెల 22న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి రాము, ఉపాధ్యక్షులు నర్సింలు, కాశీనాథ్, రామాంజనేయులు, రాములు, సుశాంత్, వెంకటయ్య, సలీం పాల్గొన్నారు.
డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేత
సాక్షి, నాగర్‌కర్నూల్/ మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు.

పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు