
రైతులకు సరిపడా యూరియా అందజేయాలి
మద్దూరు: రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్వర్యంలో మద్దూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఽసంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రానికి కేంద్రం సరఫరా చేయాల్సిన యూరియా 9.91 లక్షల మెట్రిక్ టన్నులైతే ఇప్పటి వరకు సరఫరా చేసినా యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు. మోదీ ప్రభుత్వం యూరియా సరఫరాల రాజకీయ డ్రామాలు ఆడుతుందన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా కోసం కేంద్రపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని, రైతుకు అవసరమైనప్పుడు యూరియా సరఫరా చేయకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైన మేర యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం నాయకులు కొండ నర్సిములు, శ్రీహరి, అంజి, రాములు, కృష్న, వెంకటప్ప, హన్మప్ప, రాజు, తదితరులు పాల్గొన్నారు.