
రాకపోకలకు తప్పని తిప్పలు
పట్టించుకునే వారేరి..?
ఇదిలాఉండగా, జిల్లా ఆస్పత్రి నారాయణపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురుచూపులు తప్పడంలేదు. జనరల్ ఆస్పత్రి నుంచి నారాయణపేటకు వెళ్లాలంటే ఆటోలో ఒక్కరికి రూ.20 చెల్లించాల్సిందే. లేదంటే బస్సు వచ్చేంత వరకు ఆగాల్సిందే. అసలే ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వారి వెంబడి వచ్చే వారికి సమయానికి బస్సులు రాకపోవడంతో ఆటోలో వెళ్లక తప్పడం లేదు. గురువారం సైతం గంట తర్వాత రెండు బస్సులు ఒకేసారి జనరల్ ఆస్పత్రి ముందుకు వచ్చాయి. అవి రెండు సైతం మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేటకు వేళ్లే బస్సులు. గంటసేపు తర్వాత బస్సు రావడం, బస్సు అప్పటికే నిండి ఉండడంతో ఆస్పత్రి వద్ద ప్రజలు ఇక్కేందుకు ఇబ్బందులు పడ్డారు.
నారాయణపేట మండలం అప్పక్‌పల్లి గ్రామ సమీపంలోని జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ, జనరల్ వార్డు, చిన్నపిల్లల వార్డు దగ్గర బాత్‌రూమ్‌లలో నీరు లేకపోవడంతో తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి కోసం మిషన్ భగీరథ వాటర్ సంప్‌ను నింపి ఆస్పత్రి భవనంపై నిర్మించిన ట్యాంకులకు ఎక్కించి టాయిటెట్లు వాటికి నీటిని సరఫరా చేసేవారు. అయితే మోటార్ కాలిపోవడంతో నీటి సమస్య తలెత్తిందంటూ ఆస్పత్రి వర్గాలు ఓ వైపు చెబుతున్నాయి. మరో బోరు లేకపోవడంతో సమస్య జఠిలమైంది. గత వారం రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులను ప్రజా, కార్మిక సంఘాలు జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మోటార్ మరమ్మతు చేయించి గురువారం వినియోగంలోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.
ఒంటికి.. రెంటికీ బయటికే..
ఆస్పత్రిలోని రోగులు, సహాయకులు మంచినీటి బాటిళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. చివరికి వాడుకునేందుకు సైతం నీరు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటికి, రెంటికీ బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి వేళల్లో బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు అనుపత్రి వర్గాలు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రతరమైందని అక్కడివారు వాపోతున్నారు. వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి తాగునీటికి ఇతర అవసరాలకు వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, సింకుల వద్ద పరిశుభ్రత లోపించడం, చెత్త డబ్బాలు మూలకు చేరాయని, వీటితో ఆదనపు రోగాలు వచ్చే అవకాశం ఉందంటూ రోగులు ఆందోళన చెందుతున్నారు.
సహాయకురాలు వెంకటమ్మ సాయంతో
కాలకృత్యాలకు వెళ్లి వస్తున్న వృద్ధురాలు నీలమ్మ
గంట తర్వాత ఆస్పత్రి వద్దకు బస్సు రావడంతో
జనం రద్దీ
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన నీలమ్మ. విరేచనాలతో జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం అడ్మిట్ అయ్యింది. ఆమెకు సహాయకురాలిగా వెంకటమ్మ ఉంటుంది. అయితే, ఆస్పత్రిలో మరుగుదొడ్లకు తాళం వేయడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కాలకృత్యాల కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి సరఫరా చేసి ఆసుపత్రిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేసింది.
రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా లేక.. తాగునీరు రాక.. అత్యవసర సమయంలో డాక్టర్లు స్పందించక తీవ్ర దుస్థితిలో ఆస్పత్రి కొట్టుమిట్టాడుతుందని, పట్టించుకొనే నాథుడే కరువయ్యారంటూ రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు సమస్యలు వస్తుండడంతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం, సమస్యలపై శ్రద్ద చూపకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, మద్దూర్ మండలం రేనివట్లకు చెందిన రాజు తన కుమారుడుకి జ్వరం రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే రాసిచ్చిన మందుల్లో రెండు ఉన్నాయని మరొకటి లేదని, బయట తెచ్చుకోవాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. జిల్లా ఆస్పత్రిలో సరిపడా మందులు అందుబాటులో లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాకపోకలకు తప్పని తిప్పలు

రాకపోకలకు తప్పని తిప్పలు

రాకపోకలకు తప్పని తిప్పలు