
మా కూలీ మాకివ్వాలి
● ‘ఉపాధి’ అవకతవకలపై విచారణకు వచ్చిన అధికారులను కూలీల అడ్డగింత
● పోలీసుల రంగ ప్రవేశం..
ఖానాపూర్‌లో ఉద్రిక్తత
మక్తల్: ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ మరికొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిని సస్పెండ్ చేయడంతోపాటు మా కూలీ మాకివ్వాలంటూ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ మండలం ఖానపూర్ గ్రామంలో గురువారం ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించేందుకు అధికారులు వెళ్లగా కూలీలు వారిని అడ్డుకొని వారిని తిప్పి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కార్యదర్శి, బీపీఎం, ఫీల్డ్ అసిస్టెంట్ ముగ్గురు కలిసి అవకతవకలు చేశారని గత నెల 30న మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూలీలు ధర్నా చేశారు. ఈ నెల 1న కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా.. నర్వ, మక్తల్ ఎంపీడీఓలు శ్రీనివాసులు, రమేష్‌కుమార్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో గురువారం వారితోపాటు ఏపీఓ సత్యప్రకాస్, ఈసి శ్రీనివాసులు గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కూలీలంతా ఏకమై వారిని అడ్డుకున్నారు. మా కూలీ డబ్బులు మాకివ్వాలని, చే యని వారికి డబ్బులు ఇచ్చారని, అవినీతికి పాల్పడిన వారిని విధుల్లో తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అప్పటివరకు విచారణ చేసేదిలేదంటూ వెనక్కి వెళ్లాలంటూ గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. కూలీలు అధికంగా తరలిరావడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.
ఖానాపూర్‌లో విచారణకు వచ్చిన
అధికారులతో వాగ్వాదానికి దిగగా.. కూలీలకు సర్దిచెబుతున్న ఎస్‌ఐ