
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్
● ఆర్‌ఐ, డిప్యూటీ సర్వేయర్‌నుఅదుపులోకి తీసుకున్న అధికారులు
కొత్తకోట రూరల్: రోజూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారులకు ప్రభుత్వ అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నిర్వేన్‌కు చెందిన ఓ రైతు తన ఇనాం భూమి ఓఆర్సీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ విచారణకు ఎంఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని ఆదేశించారు. వీరిద్దరు భూమి చూడటానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఎంఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. వీరిని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే హెల్ప్‌లైన్ నంబర్ 1064కు లేదా ఏసీబీ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, ఎస్‌కే జిలాని, కిషన్‌నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.