
వేతనాల్లో కోత విధించడం తగదు
నారాయణపేట రూరల్: ముందస్తు సమాచారం లేకుండా గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధిస్తూ జీవో విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీ, జేఎల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి సమయాన్ని పాఠశాలకు కేటాయించి విద్యనందిస్తున్న అధ్యాపకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ఉన్న వేతనాలను భారీగా కోత విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే గతంలో చెల్లించిన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.