వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

మహానంది: మహానంది దేవస్థానంలో ఆదివారం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, రుత్విక్కులు, అర్చకులు రఘుశర్మ, శరభయ్యశర్మలు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా గణపతిపూజ, పుణ్యాహవాచనం, అనుజ్ఞ, దీక్షాధారణ, రుత్విగ్వరణ, అఖండ దీప స్థాపన, అగ్నిప్రతిష్టాపన, నవదుర్గ కలశ స్థాపన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. గోమాతను ప్రత్యేకంగా పట్టువస్త్రాలతో అలంకరించి మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్య విశేష పూజలు చేశారు. శ్రీ కామేశ్వరీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహానందిలో వేదమంత్రాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాత్రి అమ్మవారికి సహస్రదీపాలంకరణ సేవ పూజలు జరిగాయి. మహానంది క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కామేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శైలపుత్రి రూపంలో అమ్మవారు భృంగి వాహనంపై కొలువై ఆలయ మాడ వీధుల్లో విహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement