● కాంట్రాక్ట్ ఉద్యోగిని మళ్లీ విధుల్లోకి
తీసుకోవాలని ఒత్తిళ్లు
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దాతలు విరాళంగా ఇచ్చిన ట్యాంకర్, ట్రాలీని గత ఆరు సంవత్సరాల క్రితం ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అపహరించాడు. ఆలయ పాలక మండలి సభ్యులు నిలదీయడంతో ఆయన విధులకు రాకుండా వెళ్లిపోయాడు. మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగి విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే చేత సిఫారసు చేయించినట్లు సమాచారం. ఆ ఉద్యోగి డోన్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకపోయినా అధికార పార్టీ నాయకులకు ఎందుకంత ప్రేమ చూపుతున్నారో అర్థం కావడం లేదని పలువురు భక్తులు బహిరంగంగా విమర్శస్తున్నారు. దొంగతనం చేసి దొరికిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకుంటే ఆలయానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
మహిళల భద్రతకు ‘శక్తి’
బొమ్మలసత్రం: మహిళల భద్రతకు శక్తి యాప్ ఉపయోగకరంగా ఉందని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా శక్తియాప్ ప్రయోజనాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణే తమ ధ్యేయమన్నారు. రహదారుల భద్రత, సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు తదితర చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆపదలో ఉంటే 100, 112, 1930, 1972 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నల్లమలలో స్తంభించిన రాకపోకలు
మహానంది: నల్లమల ఘాట్‌రోడ్డులో రెండు గ్రానైట్ లారీలు ఢీకొని నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చీమకుర్తి నుంచి తాడిపత్రి వైపు రెండు గ్రానైట్ లారీలు వస్తూ ఒకటి గిద్దలూరు పరిధిలోని ఘాట్‌రోడ్డులో నిలిచిపోయింది. వెనుక ఉన్న లారీ డ్రైవర్ సాయం తీసుకునేందుకు ఆపాడు. ఆగిన లారీ కింది వైపుకు వస్తున్న వెనుక ఉన్న లారీని ఢీకొనడంతో డ్రైవర్ రమేష్ స్వల్పంగా గాయపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండుటెండలో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న మహానంది, గిద్దలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సాయంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న లారీలను పక్కకు తప్పించారు. అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
విద్యార్థులకు పదో తరగతి కీలకం
ఆళ్లగడ్డ: విద్యార్థులకు పదో తరగతి కీలకమని, పట్టుదల, ఏకాగ్రతతో చదివితే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నియోజకవర్గస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులను, ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలల సంఘం డివిజన్ అధ్యక్షుడు అమీర్‌బాషా పాల్గొన్నారు.
నీట్ సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్
కర్నూలు(సెంట్రల్): ఈనెల 3న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సందేహాలు, సలహాల కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్నా 08518–277305 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.


