నంద్యాల: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 31న చిన్నపాటి ఘటన నేపథ్యంలో తనపై ప్రభుత్వం పోలీసులతో 32 కేసులు నమోదు చేయించిందన్నారు. అవే కాకుండా తాజాగా పులివెందుల, వేంపల్లి తదితర ప్రాంతాల్లో కూడా కొత్తగా కేసులు నమోదు కావడం విచిత్రంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ మీడియా ఇన్‌చార్జి పూడి శ్రీహరికి కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇతర ప్రాంతాల్లో కొత్తగా కేసులు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించుకుని ప్రజలకు సేవ చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా పట్టించుకోకుండా కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో బిజీగా ఉన్నారన్నారు. ఇంధనం కొరత, గ్యాస్ కష్టాలతో ప్రజలు ఒక వైపు అల్లాడిపోతుంటే ఇవి తమకేవి పట్టనట్టు నేతలు వ్యవహరించటం సరైందికాదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం చంద్రబాబు, లోకేష్ వల్ల అసలు కాదని, ఎన్ని జన్మలెత్తినా అమరావతి నిర్మాణం పూర్తి చేయటం వారి వల్లే జరిగే పనికాదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మంచి పనులను తన ఖాతాలో వేసుకొని టీడీపీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఆదాని డేటా సెంటర్ పేరును గూగుల్ సెంటర్‌గా పేరు మార్చి రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చామని చెప్పటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రజలకు తప్పుడు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలు నెరవేర్చకుండా మోసం చేయటం దుర్మార్గమన్నారు.


