● రాష్ట్రంలో పోలీసులు పేరుకు మాత్రమే ● శాంతిభద్రతలను గాలికి వదిలేశారు
● ప్రతిపక్షనేతను తిట్టేందుకే అనితకు మంత్రి పదవి
● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం
బొమ్మలసత్రం: ‘అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నార’ని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళ్యాణి హాజరుకాగా ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూర్య నారాయణరెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, జోనల్ ఇన్‌చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటాల నుంచి ఆవిర్భవించిందన్నారు. 2024 ఎన్నికల్లో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. చంద్రబాబు సర్కారు ఏర్పడి 22 నెలలు గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పాలకుల తీరుతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి మహిళా విభాగం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను గర్భిణి చేసి 5 సార్లు కడుపు తీయించటం దారుణమన్నారు. జరిగిన అన్యాయంపై బాధితురాలు ప్రశ్నిస్తే కర్రతో నడిరోడ్డుపై దాడి చేశారన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించటంతో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత ప్రతిపక్షనేతను తిట్టేందుకే సరిపోయారని నియోజకవర్గం దాటి గంజాయి తరలివెళ్తున్నా ఆమెకు పట్టడం లేదన్నారు. పీఏని అడ్డుగా పెట్టుకొని ఆమె వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు.
పవన్‌వి అన్ని ప్రగల్భాలే
మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను గాలికి వదిలేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడానికి సరిపోయారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే తాటా తీస్తామని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస పరిసరాల్లో మత్తుపదార్థాల విక్రయాలు జరగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించటం దారుణమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ సేవించి పట్టుబడితే అతనిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలంటే తిరిగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ మహిళల కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి సర్కారు నీరుగార్చిందన్నారు. ఈ బిల్లును టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మాబున్నిసా, మాజీ డైరెక్టర్ సునీతా అమృతరాజ్, జెడ్పీటీసీలు దివ్య, ఖలీమున్నీసా, ఎంపీపీలు వెంకటేశ్వరమ్మ, హుస్సేన్‌బీ, శారదమ్మ, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


