నంద్యాల: ఫిర్యాదులను పరిశీలించి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, అలాగే అవి పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గోరుమానుకొండకు టీబీ రహిత పురస్కారం
బేతంచెర్ల: మండల పరిధిలోని గోరుమాను కొండను 2025 సంవత్సరానికి టీబీ రహిత గ్రామంగా ప్రకటించారు. సోమవారం డీఎంహెచ్‌ఏ వెంకట రమణ అందుకు సంబంధించిన ప్రశంసాపత్రం, మెమోంటోను వైద్య సిబ్బందికి అందజేశారు. రానున్న రోజుల్లోనూ టీబీ రహిత గ్రామంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాజీ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, అధికారులు, వైద్య సిబ్బంది కృషితోనే తమ గ్రామం టీబీ రహిత పురస్కారం అందుకుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
నా భూమి నాకు ఇప్పించండి
నంద్యాల(అర్బన్): ఇండియన్ ఆర్మీలో పని చేసిన తనకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సాగు భూమిని ఇతరులు ఆక్రమించుకొని ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారని రిటైర్డు ఆర్మీ జవాన్ ఈఎస్పీ ప్రసాదరావు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక నూనపల్లె సమీపంలోని రిటైర్డు ఆర్మీ ఉద్యోగుల కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బండిఆత్మకూరు మండలం జీసీపాలెం గ్రామం సర్వేనం. 328/2లో మూడున్నర ఎకరాల సాగు భూమి ఇస్తూ తాత్కాలిక పొజిషన్ పట్టా కేటాయించారన్నారు. నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది రెన్యూవల్ చేయించుకున్నానన్నారు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడటంతో భూమి సాగు కష్టమైందన్నారు. ఈ క్రమంలో అధికారులు తన భూమిని స్థానికులు పెద్దినేని మురళీమోహన్ పేరు మీద ఆన్‌లైన్ చేశారని, దీనిపై పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి తన భూమి తనకే చెందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డు ఆర్మీ జవాన్‌ల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.


