కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఉపాఽధి పనులు కల్పించడంపైనే దృష్టి సారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ నూతన ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలతో పీడీగా విధులు నిర్వహిస్తున్న మాధవీలత నుంచి నూతన ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉంటుందని, మే నెల 1 నుంచి నూతన చట్టమైన వీబీజీ రామ్‌జీ అమలులోకి వస్తుందన్నారు. కొత్త చట్టంపై కూలీలకు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు.
కిరాణా షాపులోకి దూసుకెళ్లిన టిప్పర్
● తప్పిన ప్రమాదం
కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. టిప్పర్ గ్రావెల్ లోడ్‌తో నంద్యాల వైపు వెళుతుండగా పీఆర్ సినిమా థియేటర్ సమీపంలో డ్రైవర్ టిప్పర్‌ను నిలిపి కిందకు దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు స్లోబుగా ఉండటంతో ముందుకు కదిలి పక్కనే ఉన్న కిరణాషాపు వైపు దూసుకెళ్లింది. రోడ్డుపక్కనఆగి ఉన్న టూవీలర్ వాహనం టిప్పర్ టైర్ల కింద పడి నలిగిపోయింది. తర్వాత టిప్పర్ కిరణాషాపు వరండాను ఢీకొని ఆగిపోయింది. షాపు నిర్వాహకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు
శ్రీశైలం: దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 222/8 మైలురాయి నుంచి అటవీలోకి మంటలు వ్యాపించినట్లు శ్రీశైలం వస్తున్న వాహనదారుల తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ అటవీ శాఖ అధికారులు త్వరగా స్పందించి మంటలను అర్పే ప్రయత్నం చేయకపోతే అడవిలో మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.


