● జిల్లా కలెక్టర్ రాజకుమారి ● మద్యం సేవించి విధులకు హాజరైన పంచాయతీ సెక్రటరీపై వేటు
గోస్పాడు: సమయ పాలన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె పసురపాడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు వంటి అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదన్నారు. గ్రామంలోని సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేని విషయాన్ని గుర్తించారు. ‘స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డ్’ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీఓపై చార్జీలు ఫ్రేమ్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు కూడా సచివాలయాలు, ఇతర శాఖల్లో సిబ్బంది పని తీరు పట్ల పర్యవేక్షణ లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్ మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు కలెక్టర్ గమనించారు. వెంటనే పోలీసులను పిలిపించి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి సంబంధిత సెక్రటరీపై తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, సచివాలయంలో ఆన్‌లైన్ హాజరు నమోదు చేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.


