కోవెలకుంట్ల: పట్టణంలోని వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అకడమిక్ అడ్వయిజర్లు పరిశీలించి ఏ– గ్రేడ్ ప్రకటించారు. అకడమిక్ అడ్వయిజర్లు హనుమంతరెడ్డి, కాశీంసాహెబ్ కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. కళాశాలలో మౌలిక వసతులు, అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని గుర్తించి కళాశాలకు ఏ– గ్రేడ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కళాశాలకు ఉత్తమ గ్రేడ్ రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏటా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ కళా శాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నా రని అన్నారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ సమన్వ కర్త భాస్కర్‌రెడ్డి, అధ్యాపకులు రామసుబ్బారెడ్డి, నరేంద్రనాథరెడ్డి, కృష్ణశశాంక, కృష్ణదాసు,నాగేశ్వరరెడ్డి, రాజశేఖర్, అన్నపూర్ణ, రమణారెడ్డి, లక్ష్మిదేవి, షహనాజ్, తదితరులు పాల్గొన్నారు.
గురుకుల ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డుల విడుదల
నంద్యాల(న్యూటౌన్): 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ర్యాంకు కార్డులను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ ఎంఈ గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ ర్యాంకు కార్డు కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు https:// apbragcet. apcfss. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
సాక్షి గణపతి వద్ద
ఎలుగుబంటి సంచారం
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలోని సందర్శనీయ స్థలాల లో ఒకటైన సాక్షి గణపతి ఆలయం వద్ద సోమవారం రాత్రి ఎలుగుబంటి సంచరించినట్లు సీసీఫుటేజ్‌లో కనిపించింది. ఆలయం పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి ఆలయ గ్రిల్ గేట్ వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు దాటి వెళ్లడం కనిపించింది. రాత్రి వేళ శ్రీశైలం – సున్నిపెంట మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాల ని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
విద్యార్థినిపై
లైంగిక వేధింపులు?
నంద్యాల(అర్బన్): పట్టణం క్రాంతినగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తాలూకా పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్ల మేరకే కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


