‘పది’ పరీక్ష కేంద్రం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్ష కేంద్రం తనిఖీ

Apr 2 2026 8:46 AM | Updated on Apr 2 2026 8:46 AM

శిరివెళ్ల: స్థానిక మోడల్‌ స్కూల్‌లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని గదులను పరిశీలించి విద్యార్థులకు తాగునీరు, బెంచీల సదుపాయాలపై ఎంఈఓ నాగార్జునరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్విజిలేటర్లు, పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

విద్యార్థినులపై తేనెటీగల దాడి

డోన్‌ టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తేనెటీగలు దాడిలో ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. బుధవారం తరగతులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థినులు చెట్ల కింద వేచి ఉన్నారు. ఆ సమయంలో సమీపంలోని తేనెటీగలు దాడి చేయడంతో 7, 8, 9 తరగతి చదివే ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మల్లన్న భక్తులపై భారం

కొబ్బరికాయపై రూ. 10 పెంపు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం భక్తులపై భారం మోపుతుంది. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో కొబ్బరికాయ ధర రూ.25గా ఉండగా దానిపై రూ.10 అదనంగా పెంచుతూ కొబ్బరికాయ ధరను రూ.35గా నిర్ణయించారు. శ్రీశైల దేవస్థానంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. దర్శనానికి తరలివచ్చిన భక్తుల్లో చాలా మంది స్వామిఅమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టి తమ కోర్కెలను కోరుకుంటారు. అలాగే మొక్కులు నెరవేరిన భక్తులు కొబ్బరికాయలు కొడతారు. ప్రసుత్తం ఒక కొబ్బరికాయ ధర రూ.25గా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. బుధవారం నుంచి దేవస్థానం విక్రయిస్తున్న కొబ్బరి కాయ ధర రూ.35గా పెంచి విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా రూ.10 పెంచడంపై భక్తులు మండిపడుతున్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

బండిఆత్మకూరు: పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నారాయణాపురం గిరిజన ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్‌సీ, ఆభా లింకేజ్‌, హెచ్‌పీవీ టీకాలు, ప్రసవానంతరం తల్లులకు అందిస్తున్న వైద్య సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐపీడీ సేవల కింద గర్భిణులకు అందిస్తున్న ఐరన్‌, సుక్రోజ్‌ ఇంజెక్షన్లపై ఆరా తీశారు. అనంతరం నారపురెడ్డి కుంట గిరిజన గూడెంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ దినేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీ ఇంటికి – మీ డాక్టర్‌’ కార్యక్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎన్‌సీఏడీసీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కాంతారావు, సిబ్బంది ఉన్నారు.

బకాయిలు వెంటనే చెల్లించాలి

నంద్యాల(న్యూటౌన్‌): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ ప్రసాద్‌, సుధాకర్‌ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుకు పోయిన రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులు ఐజయ్య, సుజాత, జిల్లా గౌరవాధ్యక్షుడు సుబ్బరాయుడు, సత్యప్రకాష్‌, కిశోర్‌, రామకృష్ణకుడు, ముర్తుజావలి, నాగచెన్నమ్మ, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement