పాములపాడు: అధికారులతో పనిలేకుండా బుధవారం రైతులే కేసీ కెనాల్ 120వ కిలోమీటరు లాకీన్స్‌లా వద్ద తూడిచెర్ల సబ్ చానల్ గేట్లను ఎత్తారు. ఇందుకోసం పాములపాడు మండలంలోని శాంతినిలయం గ్రామ సమీపానికి వందలాది మంది రైతులు వచ్చారు. కేసీ కెనాల్ సిబ్బంది వారిస్తున్నప్పటికీ వినలేదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 510 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారని, ఈ నీరు నేరుగా ఆళ్లగడ్డ ప్రాంత పొలాలకు వెళ్తోందన్నారు. యర్రగూడరు, మిట్టకందాల, శాంతినిలయం, మద్దూరు, తూడిచెర్ల గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, జొన్న, మినుము పంటలు ఎండాల్సిందేనా అని ప్రశ్నించారు. కేసీ కెనాల్‌లో నీరున్నందున ఐదు రోజులుగాు నీటి విడుదల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసుకున్నట్లు రైతులు తెలిపారు.


