డోన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. కనీసం గత ప్రభుత్వం నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కూడా ముందుకు రావడం లేదు. రాజకీయ కక్షతో పట్టణంలో దాదాపు రూ. 3 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులు అలంకార ప్రాయంగా మారాయి. టీడీపీ నేతల మధ్య విభేదాలతో అధికారులు చేతులు కట్టుకుని చోద్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న చిన్న పనులతో పలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా మాకేందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్రీడలతో పాటు టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయల వ్యయంతో పార్కులు, రెస్టారెంట్లు, రహదారులను నిర్మించింది. డోన్‌ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్యాపిలి మండలం వెంగలాంపల్లె, డోన్ మండలం వెంకటాపురం తుమ్మలచెరువు ప్రాంతాలను టూరిజం, బోటు షికారు కేంద్రాలుగా, ప్యాపిలి మండలం బోయ వాండ్లపల్లె వాల్మీకి గుహలు, బేతంచెర్ల మండలం ఎర్రజ్వాల గుహలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. వీటితో పాటు పట్టణ శివారులో నగరవనం, నియోజకవర్గంలో పచ్చదనం ఉట్టిపడేట్లు పది పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే డోన్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే బుగ్గన శేషారెడ్డి మార్గ్‌లో రూ.3 కోట్లతో క్లబ్‌హౌస్‌ను నిర్మించారు. అత్యంత ఆధునిక పద్ధతిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ క్లబ్‌హౌస్‌లో మినీ ఫంక్షన్‌హాల్, రెస్టారెంట్, క్యారమ్స్, స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడేందుకు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే కేవలం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివక్ష చూపుతుండటంతో వీటి నిర్మాణం కోసం వెచ్చించిన రూ.3 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి.
కాంట్రాక్టు చేజిక్కించుకునేందుకు కుట్ర..
కోట్లాది రూపాయల ప్రజాధనంతో వెచ్చించిన ఈ క్లబ్‌హౌస్ నిర్వహణను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసమే విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధికార పార్టీలోని రెండు వర్గాలు ఈ క్లబ్‌హౌస్ నిర్వహణ కోసం పోటీపడుతుండటంతో అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో రూ. 3 కోట్ల విలువైన పనులు నిరుపయోగంగా మారాయి. అధికార పార్టీ నేతల తీరును చూసి ప్రజలు మండిపడుతున్నారు.
పట్టణంలో నిర్మించిన క్లబ్‌హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను డోన్ యూనియన్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని భావించాం. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పోటీ పడుతుండటం దుర్మార్గమైన చర్య. ప్రజల ఆశయాల మేరకు మాజీ మంత్రి బుగ్గన సహకారంతో నిర్మించిన ఈ భవనాలను త్వరలోనే ప్రారంభించాలి.
– సప్తశైల రాజేష్,
మున్సిపల్ మాజీ చైర్మన్, డోన్
వైఎస్సార్‌సీపీ హయాంలో పర్యాటకం,
పట్టణాభివృద్ధి పనులు
రెస్టారెంట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్,
మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణం
చిన్న చిన్న పనులతో
ప్రారంభోత్సవానికి సిద్ధం
టీడీపీ నేతల విభేదాలతో
జాప్యం చేస్తున్న అధికారులు
రెండేళ్లు గడుస్తున్నా నిరుపయోగం


