కొత్తపల్లి: జలాధివాసం వీడిన సంగమేశ్వరాలయంలో ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టారు. ట్రాక్టర్ డోజర్ తో బురదను తొలగింపు చేపట్టారు. ఆలయంలోని బురద నీటిని మోటర్ల ద్వారా బయటకు పంపింగ్ చేశారు. గర్భాలంయలో బురద తొలగించి పూర్తిస్థాయిలో సంగమేశ్వరుడిని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తామని పురోహితుడు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
ఆదోని రూరల్: బైచిగేరి గ్రామానికి చెందిన చాకలి వీర హుసేని(25) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చాకలి శాంతితో ఏడేళ్ల క్రితం వీర హుసేనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తతో, మామ తిక్కన్న, అత్త రాములమ్మతో గొడవపడిన శాంతి మూడేళ్లుగా కాపురానికి రాకుండా దూరంగా ఉంది. పెద్దలు పలుమార్లు పంచాయతీ చేయగా కాపురానికి రాకపోవడంతో భర్త చాకలి వీర ఉసేని మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉన్న తీర్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదోని అర్బన్: మోసానికి పాల్పడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి, అవని గోల్డ్ ఎండీ వెంకటేశ్వర్లుపై జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు రాంబట్ల ప్రశాంత్ కోరారు. ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవని గోల్డ్ ఆస్తులు 200 ఎకరాలు ఉన్నాయని, అందులో 160 ఎకరాలను 2013లోనే అమ్మేశారని తెలిపారు. అవని గోల్డ్ భూములను ఇప్పిస్తానని తన వద్ద ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు రూ. 25 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఆయనతో పాటు అవని గోల్డ్ సంస్థకు చెందిన చైర్మన్, ఎండీ, డైరెక్టర్లు తనకు అగ్రిమెంటు రాసిచ్చారని వివరించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి 50 ఎకరాలు అడిగారని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తాను విచారణ చేయగా 2013లోనే అవని గోల్డ్ భూములన్నీ అమ్మేశారని, వారిని నిలదీయడంతో ఈరోజు.. రేపు అని కాలయాపన చేస్తూ తనను మోసం చేశారన్నారు. ఈ మేరకు కేసు పెట్టానని తెలిపారు. ఈనెల 9వ తేదీన త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఈనెల 18వ తేదీన ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు, అవినీగోల్డ్ సంస్థ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లపై కేసు నమోదైందన్నారు.


