పొగాకు రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతు మృతి

Mar 23 2026 9:03 AM | Updated on Mar 23 2026 9:03 AM

ఓర్వకల్లు: పండించిన పొగాను కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గుండెపోటుతో రైతు షఫీఖాన్‌(55) మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో ఆది వారం చోటు చేసుకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షఫీఖాన్‌ అనే వ్యక్తి గ్రామంలో కొందరి రైతుల వద్ద 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో 10 ఎకరాల్లో పొగాకు సాగుచేశాడు. ఈ ఏడాది పొగాకు బాగా అమ్ముడు పోతుందని, అప్పులు తీరిపోతాయని ఆశించాడు. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, పొగాకు కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయానికి, వివిధ అవసరాలకు రూ.10 లక్షలు అప్పుచేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య నజిమాబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోడుమూరు రూరల్‌: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన బోయ శ్రీనివాసులు (36) కోడుమూరుకు చెందిన మంజులను వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిమీద శ్రీనివాసులు బైక్‌పై వెంకటగిరి గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో అల్లినగరం గ్రామానికి చెందిన బోయ గిరి తన ఆటోలో కోడుమూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కోడుమూరు శివారులో ప్రమాదవశాత్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు తరలిస్తుండగా బోయ శ్రీనివాసులు మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement