ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులా?
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల నాయకులపై రౌడీషీట్, పీడీ యాక్ట్ ఓపెన్ చేశారని, ఇది చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం సీఆర్ భవన్‌లో ఐక్య విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు కె.శ్రీనివాసులు, సోమన్న, కె.భాస్కర్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, హనోక్ హాజరై మాట్లాడారు. విశాఖపట్నంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, పీడీ యాక్ట్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కక్షపూరితగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. దీన్ని ఖండిస్తూ జనవరి 9న విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాయకులు దుర్గ, నాగరాజు, శరత్‌కుమార్, అభి, అశోక్ పాల్గొన్నారు.


