ఉగాదికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఉగాది పండుగ నాటికి జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి హౌసింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ డీఈలు, ఏఈలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 14,868 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం రూఫ్ స్థాయిలో 1,583, లింటెల్ స్థాయిలో 2,805 బేస్‌మెంట్ స్థాయిలో 6,880 ఇళ్లు ఉన్నాయన్నారు. వాటి నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసేలా హౌసింగ్ ఇంజినీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. వివిధ దశల్లో ఉన్న 556 ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, గడివేముల మండలాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తక్కువ పురోగతి సాధించిన మండలాలను ప్రత్యేకంగా తనిఖీ చేయనున్నామన్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు హౌసింగ్ 2.0 పథకం ద్వారా రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు చెప్పాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్ పాల్గొన్నారు.


