యూరియా కోసం తప్పని తిప్పలు
రుద్రవరం: రబీ సీజన్‌లో సాగు చేసిన వరి పంటకు యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయినప్పటికీ ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే అందుతున్నాయి. రుద్రవరంలోని సంత మార్కెట్‌లో ఉన్న గ్రామ సచివాలయం వద్ద బుధవారం యూరియా కోసం టోకెన్లు తీసుకునేందుకు రైతులు గంపులుగా చేరారు. గంటల కొద్ది వేచి ఉండి స్లిప్పులు రాయించుకొని వెళ్లారు. గురువారం ఇదే సచివాలయం వద్దకు వచ్చి ఇచ్చే రెండు బస్తాల యూరియాను తీసుకెళ్లాల్సి ఉందని రైతులు తెలిపారు. అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం యూరియా సరఫరా చేయలేక పోతోందని, ప్రయివేటు దుకాణాల్లో ధరలను అదుపు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


