వైఎస్సార్‌సీపీ రాష్ట్ర న్యాయ విభాగం సెక్రటరీగా అబ్దుల్
బొమ్మలసత్రం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర న్యాయ విభాగం కమిటీ సెక్రటరీగా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన అబ్దుల్ ఖైర్‌ను నియమిస్తూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన వెంకటరాముడును రాష్ట్ర న్యాయ విభాగం జాయింట్ సెక్రటరీగా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన గనపురం ధనుంజయరెడ్డిని జాయింట్ సెక్రటరీగా నియమించారు.
డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు
నందికొట్కూరు: డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ డీఐజీ పీ విజయలక్ష్మి హెచ్చరించారు. నందికొట్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్‌ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్లు తప్పులతడకగా చేస్తే సమస్యలు ఏర్పడతాయన్నారు.
జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక
ప్యాపిలి: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి హరినాథ్ రెడ్డి జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పద్మాబాయి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో హరినాథ్ రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకుని బంగారు పతకాన్ని సాధించాడన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటుకోవాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు. అనంతరం హరినాథ్ రెడ్డిని ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
బనగానపల్లె రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని, ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. నందివర్గం జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలోని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కంప్యూటర్ ల్యాబ్‌ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర న్యాయ విభాగం సెక్రటరీగా అబ్దుల్


