ఆ రైలెక్కితే కడుపు ఉబ్బరమే!
కోవెలకుంట్ల: ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణం సులభతరం చేయాలని పదేళ్ల క్రితం ప్రారంభమైన నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలోని డెమో రైలు ప్రయాణంలో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. రైలులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కి.మీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. 2016 ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నంద్యాల జిల్లా నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నంద్యాల నుంచి రేణిగుంట వరకు ప్రతి రోజు ఉదయం నంద్యాల నుంచి ఉదయం 6 గంటలకు డెమో బయలుదేరుతుంది. మొదట్లో ఈ రైలు నంద్యాల నుంచి కడప వరకు మాత్రమే నడిచేది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజులపాటు అదే జిల్లా పెండ్లిమర్రి వరకు పొడగించారు. మూడేళ్ల క్రితం నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు నడుస్తోంది. నంద్యాల నుంచి ఉదయం వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి నంద్యాలకు చేరుకుంటోంది. ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు ఈ రైలులో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి రోజు రైలు బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. వివిధ స్టేషన్లలో ఎక్కుతున్న ప్రయాణీలు కూర్చునేందుకు సీట్లు లేక గమ్యస్థానం చేరేవరకు నిలుచుని పోవాల్సి వస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం డెమో రైలులో మరుగుదొడ్ల వసతితోపాటు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు పలుమార్లు రైల్వే అధికారులను విన్నవించారు. ఇప్పటి వరకు ఆ దిశగా రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రయాణికులకు మనవి..
కాలకృత్యాలు తీర్చుకుని రైలెక్కండి..
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో డెమో రైలును బాత్‌రూం, మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. నంద్యాల నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు బయలుదేరి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, తదితర ప్రయాణికులతో రైలు ప్రతి రోజు కిటకిటలాడుతోంది. రైలు బయలుదేరిన నుంచి గమ్యస్థానం చేరే వరకు రోజుకు 12 వందలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక డెమూకు ప్రత్యామ్నాయంగా రెండు డెమూ రైళ్లు ఉండగా ఒక రైలులో మరుగుదొడ్లు, బాత్‌రూంలు అసలు లేవు. మరో రైలులో ఒకటి, రెండు మాత్రమే ఉన్నా నీటి వసతి లేకపోవడంతో వినియోగంలో లేవు. మొదట్లో కడప వరకు మాత్రమే రైలు నడిచే సమయంలో మరుగుదొడ్ల వినియోగం అవసరం లేకుండా ఉండేది. ప్రస్తుతం నంద్యాల రేణిగుంటకు ఆరు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉండటంతో ప్రయాణికులకు ఒకటి, రెండు కష్టాలు తప్పడం లేదు. షుగర్‌వ్యాధిగ్రస్తులు, మహిళలు, వృద్థులు, చిన్న పిల్లలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. రైలు ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉగ్గపట్టుకుని కూర్చోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రైలు క్రాసింగ్‌కు ఆగిన ప్రదేశాల్లో రైలు దిగి బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. నంద్యాల నుంచి రేణిగుంట వెళ్లే ప్రయాణికులు దాదాపు 288 కిమీ ప్రయాణం చేయాల్సి రావడంతో మరుగుదొడ్ల కష్టాలు తప్పడం లేదు.
ప్రతి రోజు నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు నడుస్తున్న డెమూ రైలులో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. రైలులో బాత్‌రూం, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు మరుగుదొడ్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఆరు గంటల పాటు రైలు ప్రయాణం చేయాల్సి ఉండగా షుగర్‌వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.
– రమణారెడ్డి, ప్రయాణికుడు,
సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం
ప్రధాన రైల్వేస్టేషన్లలో మౌలిక వసతుల కొరత
డెమో రైళ్లతోపాటు ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులను మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. డెమో రైలు మినహా మిగిలిన రైళ్ల రాకపోకలన్నీ రాత్రి వేళ్లలో కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో బన గానపల్లె, కోవెలకుంట్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్లల్లో తాగేందుకు సరైన నీటి వసతి లేకపోవడం విచారకరం. కొన్ని చోట్ల చిన్నపాటి వాటర్‌క్యాన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరా నిమిత్తం ఏర్పాటు చేసిన కుళాయిల దిమ్మెలు దెబ్బతిని వినియోగం లేకుండా పోయాయి. గతంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారాయి.
రెండు డెమూ రైళ్లలో
అందుబాటులో లేని మరుగుదొడ్లు
నంద్యాల – ఎర్రగుంట్ల మార్గంలో
ప్రయాణికుల ఇక్కట్లు
ఈ రైళ్లలో రోజుకు దాదాపు
2500 మంది రాకపోకలు
ఒకటి, రెండుకు ఆరుగంటల పాటు
ఉగ్గపట్టుకోవాల్సిందే
288 కి.మీ వరకు వేచి ఉండాల్సిందే
రైల్వేస్టేషన్లలోనూ మరుగుదొడ్లు కరువు
ఆ రైలెక్కితే కడుపు ఉబ్బరమే!
ఆ రైలెక్కితే కడుపు ఉబ్బరమే!


