వెండి కిరీటం బహూకరణ
వెలుగోడు: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక కిలో బరువు గల వెండి కిరీటాన్ని డాక్టర్ కేవీ శేషపాణి దంపతులు సోమవారం బహూకరించారు. ఈ కిరీటాన్ని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ బళ్లాని వెంకట సత్యనారాయణకు అందజేశారు. వెండి కిరీటానికి పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు యాదాటి రవీంద్రుడు, బొగ్గరపు లక్ష్మీనారాయణ, రమణయ్య, ఎల్లాల సురేష్, నాగ పుల్లయ్య, ఎల్లాల కష్ణుడు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సోమవారం మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు అన్‌లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇన్‌చార్జి కమిషనర్ ఆర్‌జీవీ. క్రిష్ణ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు ఈ –కైవెసీ, బయోమెట్రిక్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల వ్యవధిలో సరైన సమాధానం తెలియజేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కత్తెర పురుగు విజృంభణ
కర్నూలు(అగ్రికల్చర్): మొక్కజొన్న, జొన్న పంటలపై కత్తెర పురుగు విజృంభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రబీలో కత్తెర పురుగు సోకి తినేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో జొన్న 4,017 హెక్టార్లు, మొక్కజొన్న 7,426 హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో రెండు పంటలు 10 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. అయితే కత్తెర పురుగు నివారణకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు పెస్టిసైడ్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చిన మందులు వాడుతూ నష్టపోతున్నారు. పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయే ప్రమాదం ఏర్పడింది.
విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిస్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వెండి కిరీటం బహూకరణ
వెండి కిరీటం బహూకరణ
వెండి కిరీటం బహూకరణ


